కథ
హీరో కాకినాడ చెందిన అబ్బాయి. కాలేజీలో స్టూడెంట్ యూనియన్ లీడర్. తనవాళ్ల కోసం ఎవరినైనా ఎదిరించగలిగే కామ్రేడ్. ఎప్పుడూ స్ట్రైక్‌లు, గొడవలు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి హీరోయిన్ రాష్ట్ర స్థాయి క్రికెట్ ప్లేయర్. నేషనల్ టీమ్‌కు ఎంపిక కావాలన్నది తన లక్ష్యం. హీరో పక్క ఇంటిలో ఉండే కుటుంబానికి హీరోయిన్ దూరపు బంధువు. హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చిన హీరోయిన్, హీరో ప్రేమలో పడుతుంది. కానీ, అక్కడ హీరో ఆవేశం, గొడవలు పడటం చూసి అతనికి దూరంగా వెళ్లిపోతుంది. మూడేళ్ల తరవాత అనుకోని పరిస్థితుల్లో హీరో, హీరోయిన్ని చూస్తాడు. ఆమె మానసిక రుగ్మతతో బాధపడుతుంటుంది. అసలు ఆమెకు ఏమైంది? హీరో ని విడిచివెళ్లిపోవడం వల్లే ఆమె అలా అయిపోయిందా? లేక వేరే కారణాలు ఉన్నాయన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఫ్లస్ మైనస్
విజయ్ దేవరకొండ సినిమాపై ప్రేక్షకులు ఏదో కొత్తదనం ఉంటుందని భారీ అంచనాలు పెట్టుకొని వచ్చేవాళ్లకు. ఈ కథలో బలమైన సందేశం ఉంది. ఆడపిల్లలు తమ లక్ష్యం కోసం కస్టపడి ముందుకు వెళ్ళుతున్నపుడు, తల్లిదండ్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వాళ్లకు ధైర్యం చెప్పాలని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు సందేశాన్ని ఇచ్చారు.
సినిమా ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ ప్రేమకథను అందంగా చూపించారు. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. లవ్ సీన్స్, కాలేజీ గొడవలతో ఫస్టాఫ్ గడిచిపోతుంది. కానీ, సెకండాఫ్‌కు వచ్చే సరికి కథనం బాగా స్లో అనిపిస్తుంది.
సెకండాఫ్‌లో కూడా హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలే బలం. సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా సీరియస్‌గా సాగుతుంది. కాస్త కామెడీని జోడించి ఉంటే బాగుండేది. దర్శకుడు భరత్ కమ్మ ఒక సందేశాత్మక కథను చాలా సహజసిద్ధంగా ప్రేక్షకులకు వెండితెరపై చూపించే ప్రయత్నం చేశారు.
సినిమాకు ప్లస్ హీరో హీరోయిన్లు. హీరో గురించి చెప్పక్కరలేదు, హీరోయిన్ తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక మిగిలిన నటీనటులంతా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సినిమా సాంకేతికంగా చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ సుజత్ సారంగ్ కశ్మీర్‌ను ఎంత అందంగా చూపించారో కాకినాడనూ అంతే బాగా చూపించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఈ సినిమాకు మరో బలం. ఎడిటర్ శ్రీజిత్ సారంగ్ సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది.