మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభించే క్రమంలో కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని ఆయన ఈ నెల 9వ తేదీన సోషల్మీడియా ద్వారా ప్రకటించారు.
కరోనా వైరస్ తన జీవితంలో ఆడేసుకుందంటూ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అయితే కొన్ని రోజులు తరువాత తనకు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో మూడుసార్లు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చిందని ఆయనే మళ్ళీ ప్రకటించారు.
అయితే చిరంజీవి తీరుపై వైద్య, ఆరోగ్య శాఖ మండిపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా పాజిటివ్ వస్తే కచ్చితంగా రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండాలన్న నిబంధనలు ఉండగా. చిరంజీవి మాత్రం మూడు రోజులు క్వారంటైన్లో ఉండి ఆ తర్వాత టెస్ట్ లో నెగిటివ్ వచ్చిందని బయట తిరగడంపై వైద్య, ఆరోగ్య శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. అంతే కాదు దీపావళి సందర్భంగా ఆయన గురువు, కె విశ్వనాథ్ ఇంటికి సతీసమేతంగా వెళ్లిన చిరంజీవి ఆయన్ని సత్కరించారన్న సంగతి తెలిసందే.
ఆ ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించినట్టు తెలుస్తుంది. ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కచ్చితంగా రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండాలని, సెలబ్రెటీ అయిన మీరే ఇలా ఇష్టారీతిన బయట తిరిగితే సామాన్య ప్రజలు నిబంధనలు పాటిస్తారా? అని అధికారులు చిరంజీవిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.