తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ గెలుపు వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గౌతమి, రాధారవి, కస్తూరి రాజా, గాయత్రి రఘురామ్ వంటి వారికి గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తి బీజేపీలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది
ఆయనెవరో కాదు తమిళ సూపర్‌స్టార్ విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్. అవును చంద్రశేఖర్ బీజేపీలో చేరనున్నారని ఓ వర్గం, ఆయన ఆల్రెడీ కమలం పార్టీ సభ్యత్వం తీసేసుకున్నారని మరో వర్గం ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం గురించి తెలుసుకున్న ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని, ఇప్పట్లో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఇటీవల విజయ్ సినిమాలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ తీసే సినిమాలు తీస్తుండటంతో విజయ్ సినిమాలపై చర్చ జరుగుతోంది.
ఇటీవలే ‘మాస్టర్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. విజయ్‌పై కక్షతోనే ఈ దాడులు చేశారంటూ ఆయన అభిమానులు అప్పట్లో విమర్శలు గుప్పించారు. తాజాగా విజయ్ తండ్రి బీజేపీలో చేరనున్నారన్న వార్త తమిళనాడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.